Thursday, October 24, 2019

రహస్యం..


ఎవరు తాను...?
ఏ జన్మలొనొ నా శ్వాసపు స్వరాల్లో
పాటలా ఇమిడిపోయిందనుకుంట!

ఇప్పుడు ఇలా..
నా గుండె చప్పుడుకు,
సరిగమలను పరిచయమం చేస్తుంది.
గమకాలను స్పష్టంగా పలికిస్తుంది.

కొత్తగా రెక్కలు విప్పుకుంటున్న
ప్రతీ అనుభూతి కూడా..
ఎన్నో తలపుల్ని మోసుకుంటూ
ఆమె ఊహ మైకంలో విహరిస్తున్నాయి.

తనకీ ఇవన్నీ తెలుస్తున్నాయా..?
కనిపిస్తున్నాయా..?
నా మనసు గట్టిగా వాదిస్తుంది..
తన రహస్యం అమెకి తెలుసని!
మరింత ఆశగా ఆమె చూస్తుందని!!

Friday, June 1, 2018

అకస్మిక వాన

ప్రతీ పరిచయం
ఒక చిరునవ్వు.
అకస్మిక వాన చినుకుల్లో
మెరిసే ఒక అందమైన చిరునవ్వు.

ఎపుడు మన ముందుంటుందో,
మనతో వుంటుందో...?
ఎపుడు మన నుండి దాగుంటుందో,
మనతో దోబూచులాడుతుందో...?

తెలుస్తుందా...?

వస్తుంది.
వెళ్తుంది.
కానీ,
మధ్యలోని
అగణిత అనుభవాలను
మాత్రం
మనసుకు తోడుగా మిగిలిస్తుంది. 

Sunday, April 2, 2017

చెప్పిన పదాలు

నువ్వెదురైన... ఆ క్షణం...
చుట్టూ నిశ్శబ్ధం.
కాదు కాదు.
నిశ్శబ్ధంలా అనిపించింది.

అప్పుడేవో
కాసిన్ని పదాలు చెప్పావ్.
పెదాలతో కాదు.
కళ్ళతో.
ఒక్కోసారి కొన్ని పదాలు
పెదాలపై కంటే
కళ్ళపైనే బావుంటాయి.

నువ్వొచ్చావ్, చెప్పావ్, వెళ్ళిపోయావ్.
నాలాగే నీకూ
పదాలేవీ వినిపించలేదా?
వినిపించే వుంటాయి.
నువ్వు కూడా ఆ క్షణాన్ని
ఇలానే తలచుకుంటూ వుంటావు.
ఇదంతా నా అభిప్రాయమే
వాస్తవం అయితే బావుండు.
ఏమో! వాస్తవం కూడా కావచ్చు.

మళ్ళీ అలాంటి క్షణం
వస్తుందా?
వస్తుందిలే.
నమ్మకం..
నే విన్న పదాలపై.

Sunday, June 21, 2015

రెండురూపాయల కథ

        హాయ్ ఫ్రెండ్స్..అందరూ ఎలా ఉన్నారు?నాకు తెలిసి ఇప్పటి వరకు బాగానే ఉండుంటారు.ఈ పోస్ట్ చదివిన తర్వాత మాత్రం మీ పరిస్థితి మారిపోవచ్చు.అయ్యో భయపడిపోకండి,ఏదో సరదాగా అనేశాను.అసలు విషాయానికి వస్తే ఈ మధ్య కథ రాసి చాలా కాలం అయ్యిందని నాకు నేనుగా భావించి, ఈ రోజు ఏం చేసైనా ఏదో  ఒకటి రాసేయాలని కంకణం కట్టుకున్నా.(కొంచెం ఆవేశం ఎక్కువయినట్టుందిరా కార్తీక్, ఘాటు కాస్త తగ్గిస్తే బావుంటుందిరా-:)).ఏం రాయాలని అలోచించుతా ఉంటే నా మట్టి బుర్రకు ఒక బమ్మాండమైన ఆలోచన తట్టింది.అది ఏమనగా అధ్యక్షా.. నా చిన్నప్పటి అనుభవాల్నే కథగా మలిస్తే భావుంటుందని అనిపించింది.అలా భయభ్రాంతులై చూడకండి.సినిమాల్లోలాగా చిన్నప్పుడే ఎవర్నో హత్య చేసి జైలుకెళ్ళడం కానీ,అసలు ప్రేమంటేనే అర్ధంకాని వయసులో కూడా ఘాడంగా ప్రేమించిన అమ్మాయి విడిపోవడం లాంటి బాక్‌గ్రౌండ్ నాకు లేదని  మీకు గట్టిగా హమీ ఇస్తున్నా.ఇక ఇప్పుడు మీరు ధైర్యంగా,నిర్భయంగా,నిస్సందేహంగా ఈ పోస్ట్ చదవచ్చు.

కథ మొదలయింది..

        అనగనగా ఒక రోజు కార్తీక్ అనబడే నేను, ఎప్పుడూ అలవాటులేనిది పొద్దున్నే లేచి స్నానం చేసి,పాత బట్టలే వెసుకుని (కొత్త బట్టలు ఈ సారి డబ్బుల్లేవని అమ్మ కొనలేదు.) అమ్మ చేసిన పాయసాన్ని పట్టుకుని తాతయ్య వాళ్ళింటికి వెళ్ళాను.ఇప్పడికైనా అర్ధమైందా ఆ రోజు నా పుట్టిన రోజు.(అందరూ నన్ను విష్ చెయ్యండి మరి!).నేను ఊహించించిన విధంగానే తాతయ్య జేబులోంచి నాకు రెండు రూపాయలు వచ్చాయి.ఇకప్పుడు నా ఆనందానికి పట్టపగ్గాల్లేవంటే మీరు నమ్మరు. నేనయితే ఒక్కరోజులోనే కోటిశ్వరడుని అయ్యినట్టు ఆ రెండు రూపాయాలను పదేపదే చూసుకుంటూ, ఈ రోజు కొట్టుకెళ్ళి ఏం కొనుక్కోవాలో లిస్ట్  రాసుకుంటున్నా .పావలా బిస్కేట్లు, అర్ధ రూపాయి చాక్లెట్లు,ఇంకో పావలానేమో పల్లీపట్టీ, మిగాతా రూపాయితో రేపు కొనుకోవచ్చని అనుకుంటూ ఊహల్లో తేలిపోతున్నా.

    చకచకా ఇంటికొచ్చి బయటికెల్తున్నా అని అమ్మతో చెప్పి,సీతమ్మమ్మ కొట్టుకి పరుగెత్తుకుంటూ వెళ్ళా.సీతమ్మమ్మ చాలా మంచావిడ.ఎవరి మీదా అధారపడకుండా  తనకున్న కాస్త డబ్బుతోనే చిన్న కొట్టు పెట్టుకుని జీవితాన్ని ఎల్లదీస్తుంది.నేనంటే అమ్మమ్మకి చాలా ఇష్టం.కొడుకులు వదిలేసినా కూడా తన ఆత్మగౌరవాన్నే నమ్ముకుని బ్రతుకు సాగిస్తుంది.క్షమించాలి కథనెక్కడికో తీసుకెల్తున్నా, మళ్ళీ నా రెండురూపాయల విషాయనికొస్తే.. కొట్టు ముందు దర్జాగా నిల్చుని డబ్బాల వైపు చూస్తూ ఏం కొనాలో అలోచించుతా ఉన్నా.
అమ్మమ్మ నా వైపు నవ్వుతూ చూస్తూ "ఏరా చిన్నా ఈ రోజు ఇంత పొద్దున్నే వచ్చావెంట్రా?"అని అడిగింది.
"ఈ రోజు నా పుట్టిన రోజు అమ్మమ్మ.మా తాతయ్య నాకు రెండు రూపాయలిచ్చాడు.వాటితో ఏం కొనలా అని చూస్తున్నా"
"అవునా,నువ్వు నూరేళ్ళూ ఇలానే నవ్వుతూ ఉండాలిరా"అని ఆశీర్వదించింది.
నేను నా రెండు రూపాయల కోసం జేబులో చేయి పెట్టా అంతే నా గుండె ఢమాల్ అంది.నా జేబుకు అడుగున చిరిగిపోయి ఉంది.కొత్త బట్టలు కావు కదా.
"ఎంట్రా వెదుకుతున్నావు?"
"అమ్మమ్మా,నా దగ్గరున్న డబ్బులు కనిపించడం లేదు.పోయాయి."అంటూ బిక్కమొకం వేసుకున్నా.
"పిచ్చొడా,దానికెందుకురా బాధపడతవు?నీకెంకావాలో తీసుకోరా,నేను మాత్రం అమ్మమ్మని కాదూ?నా మనవుడికి పుట్టినరోజున ఏం ఇవ్వకుండా ఉంటానా." అంటూ నన్ను దగ్గరకు తీసుకుని నాక్కావల్సినవి చేతికిచ్చింది.
నేను మాత్రం ఏడవడం మొదలుపెట్టాను.
"ఇంకా ఎందుకేడుస్తున్నావ్ చిన్నా?ఈ రోజు నువ్విలా ఏడవకూడదు"అంటూ బుజ్జగిస్తుంది.
"నేను ఏడుస్తుంది నా డబ్బులు పోయాయని కాదమ్మమ్మ,అమ్మ చేసిన పాయసం నీకోసం తేనందుకు."అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాను.
అంతే!
సీతమ్మమ్మ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి.

Tuesday, June 9, 2015

జీవితం


జీవితం... ఒక ప్రయాణం..
ఎన్ని మలుపులు..
మరెన్ని మజిలీలు..

కలిపితే... జీవితం అవుతుంది.

కొన్ని పరిచయాలు
ఇలా వచ్చి అలా వెళ్తాయి


మరికొన్ని పరిచయాలు
మనకొక కొత్త దారిని చూపిస్తాయి.
ఎవరితో పరిచయం ఎందాక సాగుతుంతో??


అడుగడుగులోనూ
రంగురంగుల కలలకై ఆరాటం
దొరికేవరకూ పరుగులాట,
అది సొంతమైన మరుక్షణం
మరొక దానికై వెదుకులాట.


ఇదేనా జీవితం
అర్ధం కాదు.
అర్ధమయితే ఇది జీవితమే కాదు.

Saturday, February 14, 2015

బొమ్మరిల్లు-మనసున కదిలే కథవైనా

              బొమ్మరిల్లు సినిమాలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పాట ఒకటుంటుంది.మన "సిరివెన్నెల" గారి సాహిత్యంలో అందంగా ముస్తాబయిన ఆ పాట "నమ్మక తప్పని నిజమైనా.." ఈ పాట తెలియని వాళ్ళు మన తెలుగు ప్రేక్షకులలో ఎవ్వరూ ఉండరు.అటువంటి పాట మీదున్న మమకారంతో,సిరివెన్నెల గారి మీద భక్తితో నే చేసిన చిన్ని ప్రయత్నమే ఈ "మనసున కదిలే కథవైనా..".



పల్లవి: మనసున కదిలే కథవైనా కలలా మిగిలా వనుకున్నా
కన్నులు కనవే ఈ నిజ మిపుడైనా..ఓ..
గతమే జ్ఞాపకమొస్తున్నా క్షణమే యుగమై పోతున్నా
నీ తలపుని నా మౌనం వీడేనా...ఓ..
ప్రాణంతో బ్రతికున్నా నేశిలగానే మిగిలున్నా
దరిచేరిన ఈ నిశీధిలోనా..ఓ..
అడుగులు వేస్తూ ఉన్నా నను వీడిన జతవే ఐనా
నీకోసం నే శూన్యం చూస్తున్నా...
మనసున కదిలే కథవైనా కలలా మిగిలా వనుకున్నా
కన్నులు కనవే ఈ నిజ మిపుడైనా..ఓ..

చరణం1: నాలో..ఆశంతా నిజమై..పో దింకా
అంటూ పగిలిన నా హృదయం ఇక అతికే వీలుందా
నా..నీడెంటా నువ్వే..రాకుండా
చేసే గమనం ఏ గమ్యం లేకుండా చేస్తుందా
జతగా నను చేరి అలా చేజారిన బంధం అలా..
నీ చెంతకు నను నడిపేది ఎలా...ఆ...
మనసున కదిలే కథవైనా కలలా మిగిలా వనుకున్నా
కన్నులు కనవే ఈ నిజ మిపుడైనా..ఓ...

చరణం2: నీ..చూపుల్లో కురిసే..నవ్వుల్లో
కొన్నాళ్ళైనా నారూపం తడిసిందనుకోనా
నా..దారుల్లో మిగిలే..చీకటిలో
ఎన్నాళ్ళైనా నే మిణుగురులా వెలగను అనుకోనా
తొలివలపుల అనుభవమా విరజాజుల సౌరభమా..
జవాబంటూ దొరకని  ప్రశ్న నీవా....ఆ...ఆ...
మనసున కదిలే కథవైనా కలలా మిగిలా వనుకున్నా
కన్నులు కనవే ఈ నిజ మిపుడైనా..ఓ..
గతమే జ్ఞాపకమొస్తున్నా క్షణమే యుగమై పోతున్నా
నీ తలపుని నా మౌనం వీడేనా...ఓ..


ఈ పాట orginal lyrics ఇక్కడ..... 




****Thank you:-)****

Thursday, January 15, 2015

కొన్ని అంతే!(ఒక అందమైన కవిత)




నింగి చెక్కిలి నుండి జారిపడే
చిట్టి చినుకు 
పుడమిపై ఏ సోయగాన్ని ముద్దాడుతుందో?
"ఊహించే అంచనాలకు అందనిదది.

అర్ణవపు చూపుల్లో ఆశగా ఎగిసిపడే
కలల అలలు
ఆకాశం వైపు ఎందాక ఎగురుతాయో?
"గణిత సూత్రాలకు తలొగ్గవవి."

అడవి గుండెల్లో ప్రేమగా ఒదిగిపోయే
వసంతపు ఆకుపచ్చగీతం
అంత మాధుర్యంగా ఎలా వుంటుందో?
"ఏ స్వరకర్తకూ అర్థంకాదది."

కొన్ని అంతే!
ఎవ్వరికీ ఎప్పటికీ
అందవు.తలొగ్గవు.అర్థంకావు.

ఇలాంటివి కొన్నుంటాయి.
మన అక్షరాలలో దాచుకోవాల్సినవి.
వదిలిపెట్టకూడనివి.


Saturday, January 10, 2015

చీకటి

 

చీకటి
వెలుతురే భయపడేంత చీకటి.
అందుకేనేమో,
వెలుగుతూ ఆరిపోతూ
దొంగాటలాడుతున్న వీధి దీపాలు.

గాలిని నెట్టేసే నీడలు
నీడల్నే నమిలే చీకటి.
ఎంత ఘోరం,
వాటి భాధలర్ధమయినా
చీకటినేమి చేయలేని అసమర్ధుడిని.

ఏవేవో శబ్ధాలు భయానకంగా
చీకటి దారి పొడువునా ఎదురవుతుంటే
వణుకుతూ దాటిపోతున్న పిరికివాణ్ణి.

అమ్మో!
ఒక్కసారి బయటపడ్డాక
మళ్ళీ తలవనెప్పుడూ ఈ చీకటి వ్యూహాన్ని.

 

Friday, January 9, 2015

ఏకాంతం




కనుల సంద్రంలో దాచుకున్న
బంగారువర్ణపు చేపల్లాంటి కలలన్నీ
నిజమయ్యే వెన్నెల క్షణాలపై
కాలం వయ్యారంగా అడుగులేస్తున్నపుడు,


గతాన్ని మౌనంగా తడుముతూ..
భవిష్యత్తుని అందంగా ఊహిస్తూ..
క్రొంగొత్త పాటలెన్నో పాడుకునేలా
మనసంతా కమ్ముకున్న వసంతమే
                 ఏకాంతం.

Sunday, December 7, 2014

హేమంతం


 

మంచు పూల పల్లకిలో
అందంగా ముస్తాబయిన హేమంతం..
తన సోయగాలతో మనసును తడుముతూ
తనువంతా చక్కిలిగింతలు పెట్టి నవ్వుతుంది.


ఏమని వర్ణించనూ..?
రేయంచు నుంచి జారిపడిన వేకువఝాములో
పూలకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్యాలను.
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడిని
మసకతెర చాటునుంచి తొంగిచూస్తున్న ఈ లోకాన్ని.


హేమంతమా!

నీ కౌగిట్లో వణుకుతున్న అక్షరాల్ని
ఒడిసిపట్టలేక అలిసిపోతున్న ఈ క్షణాల్లో..
వర్ణాతీతమైన నిన్ను బంధించాలనుకున్న
నాలోని కవిత్వం,ఓటమిని ప్రేమగా ముద్దాడింది.


Thursday, November 27, 2014

ఈ క్షణమే తేల్చి చెప్పవా సఖీ...



నువ్వు....
వలపు సంకెళ్ళతో ఊహల గువ్వల్ని బంధించి,
నా చిట్టి గుండెగూటిలో నిలుపగల మంత్రగత్తెవు కదా!
అయితే,నాలో నీ జ్ఞాపకాల బలమెంతో చెప్పగలవా?
నాలోని కవ్వింతల తుఫాన్‌ను ఆపగలవా?
నాకు తెలుసు,వాటికి నీ దగ్గర మంత్రాలుండవని.

మరి నీకు తెలుసా..?

నువ్వు నడిపించుకెళ్ళిన దారుల వెంట,
రాలిపడిన అనుభూతుల పూవుల పరిమళమేదో
నా మనసుని ఎన్నటికీ వెంటాడటమాపదని.

నాలో నువ్వేసిన ఆశల పందిరిని,
ఘాడంగా అల్లుకుపోయిన నీ తలపుల తీగలు
కొంగొత్త కోరికలను చిగురిస్తూ ఎప్పటికీ వాడిపోవని.

కానీ,నాలో ఏ మూలనో ఓ చిన్ని సందేహం,
నువ్వు నా ప్రణయగీతాన్ని ఆస్వాధిస్తావో లేదో అని?!

ఈ క్షణమే తేల్చి చెప్పవా సఖీ...

నా ఆకాశమంత ప్రేమలో,
జాబిలమ్మవై వెన్నల వెలుగులీనుతావని!
తోకచుక్కలా నేలరాలిపోవని!!


Saturday, November 22, 2014

ఒక్క ఆశ



అతడు ఆకాశాన్ని మింగేసే చూపులతో
వెన్నలను తాగాలని ప్రయత్నిస్తున్నాడు.
రైలు కిటికీ పక్కన కూర్చున్నాతడికి
చలికి వణుకుతున్నట్లున్నాయి నక్షత్రాలు.

అతడి ప్రియసఖి ఆఖరిసారి
జ్ఞాపకంగా ఇచ్చిన కాఫీమగ్‌ను
పదేపదే చేతివేళ్ళతో తడుముతూ
సన్నటి చిరునవ్వుల మెరుపులను
కనుల నిండా నింపుకున్నాడతడు.

ఇంకొద్దిసేపట్లో అతడిలోని విరహం
మధురక్షణాలను తాకనున్నదేమో!
అతడి తనువంతా హాయిగా నవ్వుతూ
తన్మయత్వంతో నాట్యాలాడుతున్నట్లుంది.
అతడి గుండెవేగం మరింత జోరుగా
రైలు బండి పరుగులాగ ఉరకలేస్తుంది.

అతడి ఆశ ఒక్కటే,
సెలయేటి గొంతులో గులకరాళ్ళ
చప్పుడిలా..
ఆమె ఒడిలో ఒదిగిపోవాలని!

Sunday, November 16, 2014

మేఘాలు రాసిన కవిత


నీలి రంగు కాగితంపై
గజిబిజిగా గీసిన బొమ్మల్లా
ఆకాశం నిండా పరుచుకున్న
శ్వేతవర్ణపు మేఘాలు.

ఒకదానితో మరొకటి
పెనవేసుకుపోతూ విడివడుతూ
గుంపులు గుంపులుగా
సాగిపోతున్న మేఘాలు.

పెద్ద పెద్ద జంతువుల
ఆకారాన్ని మింగినట్లుగా
గమ్మత్తుగా కనబడుతున్న
ఎగుడూదిగుడూ మేఘాలు.

కొండల పైట చాటుకు
మెల్లగా ఒదుగుతున్న
సూరీడి వెలుగుతో పాటుగా
మాయమవుతున్న మేఘాలు.

నాలో కవిత్వాన్ని
కరిగించి
చీకటిలో కలిసిన మేఘాలు.


Sunday, November 2, 2014

మౌనప్రణయరాగం


నువ్వెదురుగా లేనప్పుడు
అద్భుతమైన కర్ణాటక సంగీతంలా 
హాయిగా, చాలా నెమ్మదిగా 
సాగిపోతుందీ గమ్మత్తైన కాలం.

ఎన్నో ఆశలు రాల్చే చూపులతో

కలలను వెదుకుతూ ఎదురుచూస్తాను.

ఆ అద్వైత క్షణాలన్నీ

నీ జ్ఞాపకాలలో కలిసిపోతుంటే
నన్ను నేను కోల్పోయి
నీ ఊహలలో వెదుకుతుంటాను.

నువ్వొస్తావు,

మన ఇరువురి మధ్య
ఏవేవో కబుర్లు దోబూచులాడతాయి.
నీ దగ్గరున్న నవ్వుల నురగను
నా పెదాలపై అందంగా అంటిస్తావు.

అదేంటో మరి అర్ధం కాదు!

నీ సాంగత్యంలో ఎంత సమయమైనా
మంచుబిందువులా ఇట్టే కరిగిపోతుంది.

నువ్వు తిరిగి వెళ్తునప్పుడు

ఆగీ ఆగీ విడివడుతున్న
నీ అరచేతి వేళ్ళని చూస్తూ..
ఎన్ని ఊసులు ఛిద్రమవుతాయో!
మరెన్ని స్వప్నాలు శిధిలమవుతాయో!!

మౌనప్రణయరాగం మళ్ళీ 
నా మదిలో మొదలవుతుంది...

Sunday, October 19, 2014

వెన్నల సంతకం

 

రాతిరి వేళ ఆకాశమంతా
విరబూసిన చుక్కలు కురిపించే
పసిడి వెలుగులలో తడుస్తున్నప్పుడు
అనుభూతుల వేణువేదో
కొంగొత్త సంగీతాన్ని ఆలపిస్తుంది.

అలాంటప్పుడు,

ఆ మధుర క్షణాల మీద
మనసు పయనం సాగిస్తూ..
స్వప్న లోకంలోకి జారిపోతుంది.

ఎప్పుడూ గీయని కలల చిత్రమేదో
వెన్నల హంగుతో
రంగుల్ని అద్దుకుంటుంది.

ఎన్నడూ వినని వెన్నల  పాటేదో
మనసు గొంతులో
హాయిగా పాడుకుంటుంది.

చీకటి గూటిలో దీపంలా
వున్న చందమామను చూస్తూ...
ఎన్నో అనుభవాల్ని తడుముతూ..
మనసు తుమ్మెదలా ఎగురుతుంది.

ఆ తుమ్మెద ఝుంకారమే
నా మనసుపలికే మౌనరాగం.
ఎన్నటికీ చెరగని వెన్నల సంతకం.
 

Wednesday, September 3, 2014

మళ్ళీ మళ్ళీ


పసితనపు చెట్టుకొమ్మకు వ్రేలాడదీసిన
తీపి జ్ఞాపకాల ఊయలపై
హాయిగా ఊగుతున్న నా మనసుపై
ఎన్నో కలలు హత్తుకుపోతున్నాయి.

నిదురపోయే వేళకి
ఆరుబయటున్న నానమ్మ మంచంలోకి
వాలిపోయి కథలు చెప్పిచ్చుకున్న
మరెన్నో రాత్రుల గురుతులు
నా మనసును వెంటాడుతున్నాయి.

ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నప్పుడు
ఎంతో ఆశను నింపుకున్న
ఆ అమాయకపు చూపుల్లోని కాంతులు
ఇంకా నాలో వెలుగుతూనే వున్నాయి.

"ఈ అనుభూతులన్నీ అందమైన బాల్యాన్ని
తిరిగి తీసుకు రాలేకపోవచ్చేమో! కానీ,
అప్పటి లేలేత అనుభవాలన్నింటినీ 
మళ్ళీ మళ్ళీ మన మనోలోకాల్లోకి తెస్తుంటాయ"ని,
గోడపై  పూలదండేసున్న ఫొటోలోంచి
నానమ్మ నవ్వుతూ చెబుతున్నట్లనిపిస్తుంది.

Friday, August 29, 2014

కాగితపు పడవలు


చినుకూ చినుకూ కలిసి,
చినుకుపై చినుకు పడుతూ,
చినుకుతో చినుకు పోటిపడుతూ,
ధారలు ధారలుగా ఏకమై,
మళ్ళీ మళ్ళీ కలుస్తూ విడిపోతూ,
ఈ భువిని తనివితీరా ముద్దాడుతూ,
నింగికి నేలకూ మధ్య వారధియై
వాటిని కలుపుతూ,
ఒక అందమైన చిత్రాన్ని
నా కనుల ఎదుట గీస్తున్న వర్షం.


అంతేకాదు,
ఈ అందమైన దృశ్యానుభూతులు

నా మనసున ఏ మూలనో దాచిపెటుకున్న
ఎన్నో జ్ఞావకాల దొంతర్లను కదిలిస్తూ,
బాల్యంలోని గురుతులను,
అప్పటి చిలిపితనపు సరదాలనీ,
చినుకుల చిటపటలతో  తట్టిలేపుతుంటే,


వర్షంలో తడుస్తూ చిందాడిన
ఆ ఆనందమైన,అద్భుతమైన క్షణాలను
ఊహిస్తూ నా తనువంతా నవ్వుకుంటుంది.


రంగురంగుల కాగితపు పడవలను
నీటిలో వేసి మురిసిపోతున్న కనులలోని
ఆ మెరుపులు నన్ను ఎన్నటికీ వీడిపోవు.
వర్షపునీటిలో గెంతులు వేస్తున్నపుడు
చేసిన అల్లరి అరుపులు,
ఆ శబ్దాలు నా మనసును వెంటాడటమాపవు.

Saturday, August 9, 2014

హృదయము రాసుకున్న లేఖ


నీతో గడిపిన క్షణాలన్నింటి మీద కాలం,
చక్రాలేసుకుని పరుగులు తీస్తుంటుంది.
నీతో కలిసి పయనించిన ఆ దారుల్లో
ఏవో అనుభూతి గీతాలు వినిపిస్తున్నాయి.


నీ నవ్వులు విరబూసిన వెన్నల రాతిరితో
నాలో గణించలేని నక్షత్రాలను వెలిగిస్తుంటావు.
నీ మనసు కంటున్న కలల పుస్తకంలో
నేను కలాన్నై రాయాలని ఆశ పెడుతుంటావు.


నీ అడుగులు కోరే గమనం నేనై
నా గమ్యం తలచే తీరం నీవై
ప్రణయపు మంత్రలోకాల్లో ఊగిసలాడే 

ఆ క్షణాలకోసం ఎదురుచూస్తూ...


నా హృదయము రాసుకున్న ఈ లేఖ
నీ హృదయానికి చేరేదెన్నడో?
మన గుండెల చప్పుళ్ళు ఒకటయ్యేదెప్పుడో?



Saturday, July 19, 2014

మనసులోని అక్షరం


మనసులో మెరిసిన మెరుపొక ఆలోచన.
ఆ మెరుపు వెనుక పరుగులుతీసే మనసు
ఏదో రాయాలని.
అంతే కదా!
మనసు ఆలోచనను పుట్టించిది.
ఆలోచన తిరిగి మనసును నడిపిస్తుంది
.

అక్షరాల వెదుకులాటలో
అలసట లేని ప్రయాణం మొదలైంది...
అనుభవాల కుండలో అనుభూతుల్ని మోసుకెళ్తూ.


సేకరించిన అనుభూతులన్నింటిని
దోసిలితో పైకెత్తి  గుండెలకు హత్తుకున్నాను.
అంతే! ఆ క్షణంలో...
అన్నీ అనుభూతులు సిరాలా రూపుదాల్చి
కాగితంపై అక్షరాలుగా జాలువారాయి.


రాసిన దానిని తిరిగి చూశాను.
అపుడు-
కనిపిస్తున్నది అందంగా ముస్తాబయిన అక్షరాలు కావు.
భావుకతపు రంగుల్ని అద్దుకున్న నా మనసు.

Sunday, June 8, 2014

వెన్నల గీతం


ఈ విచిత్రమైన తోటలో
ఎన్ని అందమైన పువ్వులున్నాయో!?
లెక్కపెడదామనుకున్నాను. కానీ
నా అలోచనలకు అందడంలేవవి
.

అహ!,ఎలా దోబుచులాడుతున్నాయో!?
కొన్ని  క్షణాల్లో మాయమవుతూ,
మరికొన్ని కొత్తవి విరబూస్తూ,
ఇంకా కొన్ని రాలిపడుతూ,
భలే తమాషాగా ఉన్నాయి.


ఇంతకీ ఇది ఏ తోట?
నింగిలో కురిసే వెన్నల వర్షమా!?
మనసును తడిపే ఆశల గీతమా!?