Friday, August 29, 2014

కాగితపు పడవలు


చినుకూ చినుకూ కలిసి,
చినుకుపై చినుకు పడుతూ,
చినుకుతో చినుకు పోటిపడుతూ,
ధారలు ధారలుగా ఏకమై,
మళ్ళీ మళ్ళీ కలుస్తూ విడిపోతూ,
ఈ భువిని తనివితీరా ముద్దాడుతూ,
నింగికి నేలకూ మధ్య వారధియై
వాటిని కలుపుతూ,
ఒక అందమైన చిత్రాన్ని
నా కనుల ఎదుట గీస్తున్న వర్షం.


అంతేకాదు,
ఈ అందమైన దృశ్యానుభూతులు

నా మనసున ఏ మూలనో దాచిపెటుకున్న
ఎన్నో జ్ఞావకాల దొంతర్లను కదిలిస్తూ,
బాల్యంలోని గురుతులను,
అప్పటి చిలిపితనపు సరదాలనీ,
చినుకుల చిటపటలతో  తట్టిలేపుతుంటే,


వర్షంలో తడుస్తూ చిందాడిన
ఆ ఆనందమైన,అద్భుతమైన క్షణాలను
ఊహిస్తూ నా తనువంతా నవ్వుకుంటుంది.


రంగురంగుల కాగితపు పడవలను
నీటిలో వేసి మురిసిపోతున్న కనులలోని
ఆ మెరుపులు నన్ను ఎన్నటికీ వీడిపోవు.
వర్షపునీటిలో గెంతులు వేస్తున్నపుడు
చేసిన అల్లరి అరుపులు,
ఆ శబ్దాలు నా మనసును వెంటాడటమాపవు.

Saturday, August 9, 2014

హృదయము రాసుకున్న లేఖ


నీతో గడిపిన క్షణాలన్నింటి మీద కాలం,
చక్రాలేసుకుని పరుగులు తీస్తుంటుంది.
నీతో కలిసి పయనించిన ఆ దారుల్లో
ఏవో అనుభూతి గీతాలు వినిపిస్తున్నాయి.


నీ నవ్వులు విరబూసిన వెన్నల రాతిరితో
నాలో గణించలేని నక్షత్రాలను వెలిగిస్తుంటావు.
నీ మనసు కంటున్న కలల పుస్తకంలో
నేను కలాన్నై రాయాలని ఆశ పెడుతుంటావు.


నీ అడుగులు కోరే గమనం నేనై
నా గమ్యం తలచే తీరం నీవై
ప్రణయపు మంత్రలోకాల్లో ఊగిసలాడే 

ఆ క్షణాలకోసం ఎదురుచూస్తూ...


నా హృదయము రాసుకున్న ఈ లేఖ
నీ హృదయానికి చేరేదెన్నడో?
మన గుండెల చప్పుళ్ళు ఒకటయ్యేదెప్పుడో?