Thursday, January 15, 2015

కొన్ని అంతే!(ఒక అందమైన కవిత)




నింగి చెక్కిలి నుండి జారిపడే
చిట్టి చినుకు 
పుడమిపై ఏ సోయగాన్ని ముద్దాడుతుందో?
"ఊహించే అంచనాలకు అందనిదది.

అర్ణవపు చూపుల్లో ఆశగా ఎగిసిపడే
కలల అలలు
ఆకాశం వైపు ఎందాక ఎగురుతాయో?
"గణిత సూత్రాలకు తలొగ్గవవి."

అడవి గుండెల్లో ప్రేమగా ఒదిగిపోయే
వసంతపు ఆకుపచ్చగీతం
అంత మాధుర్యంగా ఎలా వుంటుందో?
"ఏ స్వరకర్తకూ అర్థంకాదది."

కొన్ని అంతే!
ఎవ్వరికీ ఎప్పటికీ
అందవు.తలొగ్గవు.అర్థంకావు.

ఇలాంటివి కొన్నుంటాయి.
మన అక్షరాలలో దాచుకోవాల్సినవి.
వదిలిపెట్టకూడనివి.


Saturday, January 10, 2015

చీకటి

 

చీకటి
వెలుతురే భయపడేంత చీకటి.
అందుకేనేమో,
వెలుగుతూ ఆరిపోతూ
దొంగాటలాడుతున్న వీధి దీపాలు.

గాలిని నెట్టేసే నీడలు
నీడల్నే నమిలే చీకటి.
ఎంత ఘోరం,
వాటి భాధలర్ధమయినా
చీకటినేమి చేయలేని అసమర్ధుడిని.

ఏవేవో శబ్ధాలు భయానకంగా
చీకటి దారి పొడువునా ఎదురవుతుంటే
వణుకుతూ దాటిపోతున్న పిరికివాణ్ణి.

అమ్మో!
ఒక్కసారి బయటపడ్డాక
మళ్ళీ తలవనెప్పుడూ ఈ చీకటి వ్యూహాన్ని.

 

Friday, January 9, 2015

ఏకాంతం




కనుల సంద్రంలో దాచుకున్న
బంగారువర్ణపు చేపల్లాంటి కలలన్నీ
నిజమయ్యే వెన్నెల క్షణాలపై
కాలం వయ్యారంగా అడుగులేస్తున్నపుడు,


గతాన్ని మౌనంగా తడుముతూ..
భవిష్యత్తుని అందంగా ఊహిస్తూ..
క్రొంగొత్త పాటలెన్నో పాడుకునేలా
మనసంతా కమ్ముకున్న వసంతమే
                 ఏకాంతం.