Friday, August 29, 2014

కాగితపు పడవలు


చినుకూ చినుకూ కలిసి,
చినుకుపై చినుకు పడుతూ,
చినుకుతో చినుకు పోటిపడుతూ,
ధారలు ధారలుగా ఏకమై,
మళ్ళీ మళ్ళీ కలుస్తూ విడిపోతూ,
ఈ భువిని తనివితీరా ముద్దాడుతూ,
నింగికి నేలకూ మధ్య వారధియై
వాటిని కలుపుతూ,
ఒక అందమైన చిత్రాన్ని
నా కనుల ఎదుట గీస్తున్న వర్షం.


అంతేకాదు,
ఈ అందమైన దృశ్యానుభూతులు

నా మనసున ఏ మూలనో దాచిపెటుకున్న
ఎన్నో జ్ఞావకాల దొంతర్లను కదిలిస్తూ,
బాల్యంలోని గురుతులను,
అప్పటి చిలిపితనపు సరదాలనీ,
చినుకుల చిటపటలతో  తట్టిలేపుతుంటే,


వర్షంలో తడుస్తూ చిందాడిన
ఆ ఆనందమైన,అద్భుతమైన క్షణాలను
ఊహిస్తూ నా తనువంతా నవ్వుకుంటుంది.


రంగురంగుల కాగితపు పడవలను
నీటిలో వేసి మురిసిపోతున్న కనులలోని
ఆ మెరుపులు నన్ను ఎన్నటికీ వీడిపోవు.
వర్షపునీటిలో గెంతులు వేస్తున్నపుడు
చేసిన అల్లరి అరుపులు,
ఆ శబ్దాలు నా మనసును వెంటాడటమాపవు.

2 comments:

  1. ధారలు ధారలుగా ఏకమై,
    మళ్ళీ మళ్ళీ కలుస్తూ విడిపోతూ,
    ఈ భువిని తనివితీరా ముద్దాడుతూ, బాగారాశారండి.

    ReplyDelete