Wednesday, March 19, 2014

అనుభూతి స్వరాలు




ఎక్కడి నుంచొ వచ్చిన మేఘంలా
నా కనుల ఎదుట  వర్షమై కురిశావు.
ఊహల జలపాతంలా ఉప్పొంగి
నాలో ఆశల తీరాన్ని పలుకరించావు.

నీతో వేసిన ప్రతీ అడుగులో
ఎన్నటికీ చెరగని ఆనవాల్లు.

కన్నులు విప్పిన ప్రతీ కలలో
తడిసిపోతున్న  నీ జ్ఞాపకాలు.

తూరుపు వెలుగంటని వెన్నల్లో
వీచె చల్లని గాలిలా
మదిని తాకిన నీ పరిచయంలో
వింటున్నాను
ఎన్నో అనుభూతులు.
మరుపురాని మధుర గీతాలు.

 

Sunday, March 16, 2014

ఆకాశం పంపిన ప్రేమలేఖ!



ప్రియమైన అవనికి!

"ఎలా ఉన్నావు?" అనే ప్రశ్నను
రాయలేని ప్రేమలేఖిది.
ఎందుకంటే, నీకు తెలుసు
అనూక్షణం..
నువ్వు నా కనుపాపల్లోనే తూగుతావని.
నీ తలపుల నావలోనే
నా జీవన పయనం సాగుతుందని.

అలాగే,
ఇంకా ఎన్ని యుగాలు...
కాలం ఒడిలో కరిగిపోయినా
మన మధ్యనున్న దూరం మాత్రం
మనల్ని విడిచిపోదు.
పాపం, దానికి తెలియదు.
మన మనసుల మధ్య
తనకు చోటులేదని.

కానీ, ఒక్కోసారి
నా మనసులో విరహగీతం
తాకుతుంటే...
నీ ఆలోచనలు నా ఎదపై
వియోగ భారాన్ని వదిలివెళ్తాయి.
అలాంటప్పుడు
ఇదుగో,ఇలా అక్షరాలు లేని కబుర్లు
చినుకై కరిగి నిన్ను ముద్దాడుతాయి.
అయ్యో!అదంతా సిగ్గె!?
భలే అందంగా ఉంది:):)
మళ్ళీ నా ప్రేమలేఖ పంపేవరకూ
కొంచెం దాచుకో మరి!
ఇక సెలవు కోరుతూ...

ఇట్లు,
నీదైన ఆకాశం.

 

Tuesday, March 11, 2014

అతడు...ఆమె...ప్రేమ...

అతడు
దేని కోసమో
ఆరాటపడుతూ
వడివడిగా
అడుగులేస్తున్నాడు.
దారి పొడువునా
పచ్చగా మెరిసే
పంటపొలాలు.
గోదారమ్మ ఒడ్డుకి
చేరుకోవడానికి
దాటాల్సిన పొలాలు
ఇంకో అయిదు.

ఆమె
కదులుతున్న
అలలవైపు చూస్తూ..
ఆనందాన్ని
అక్కున చేర్చుకొని
ఎవరి కోసమో
ఆతృతగా
ఎదురుచూస్తుంది.

అతడొచ్చాడు.

ఇరువురి మధ్య
నిశ్శబ్ధం.
ఒకరి శ్వాస
ఒకరికి వినిపించేంతగా.

అతడు
తన పెదాలపై
బిగుసుకున్న
మౌనాన్ని దాటి
"నిన్ను ప్రేమిస్తున్నాను."
అని చెప్పేశాడు.

అంతే

ఆమె చిరునవ్వు
చటుక్కున
అతడి కళ్ళల్లో
మెరిసింది.
ఆ మెరుపులో
వారి మధ్య
మిగిలున్న దూరం
ముక్కలయ్యింది.
కలగన్న అనురాగం
ఒక్కటయ్యింది.
 

Sunday, March 2, 2014

ప్రత్యూషం

  
తూరుపు కొండలను దాటి
మెల్లగా కదిలివస్తున్న సూరీడు,
ఎర్రని కాంతులీనుతూ
ఆకాశమంతా తన అందాన్ని
పరుచుకున్నాడు.

వదిలిపోతున్న చీకటి తెరల్ని
దిగులుగా వీడుతున్న నక్షత్రాలు.

రాతిరి పూదోటలో
అకస్మాత్తుగా ముగించిన
కలల పయనం
నిజం కాదని స్పృహ కలిగాక,
ఆ క్షణం..
ఓ తియ్యని చిరునవ్వు
నా పెదాలను ముద్దాడింది.

' ఈ రోజు' అనే కొత్త లోకానికి
స్వాగతం  పలుకుతూ....
ప్రకృతి ఒడిలొ
అధ్బుతమైన చిత్రంలా
అరవిరిసిన ప్రత్యూషం.
నా చిన్ని మనసులో కూడా.