Saturday, July 19, 2014

మనసులోని అక్షరం


మనసులో మెరిసిన మెరుపొక ఆలోచన.
ఆ మెరుపు వెనుక పరుగులుతీసే మనసు
ఏదో రాయాలని.
అంతే కదా!
మనసు ఆలోచనను పుట్టించిది.
ఆలోచన తిరిగి మనసును నడిపిస్తుంది
.

అక్షరాల వెదుకులాటలో
అలసట లేని ప్రయాణం మొదలైంది...
అనుభవాల కుండలో అనుభూతుల్ని మోసుకెళ్తూ.


సేకరించిన అనుభూతులన్నింటిని
దోసిలితో పైకెత్తి  గుండెలకు హత్తుకున్నాను.
అంతే! ఆ క్షణంలో...
అన్నీ అనుభూతులు సిరాలా రూపుదాల్చి
కాగితంపై అక్షరాలుగా జాలువారాయి.


రాసిన దానిని తిరిగి చూశాను.
అపుడు-
కనిపిస్తున్నది అందంగా ముస్తాబయిన అక్షరాలు కావు.
భావుకతపు రంగుల్ని అద్దుకున్న నా మనసు.

Sunday, June 8, 2014

వెన్నల గీతం


ఈ విచిత్రమైన తోటలో
ఎన్ని అందమైన పువ్వులున్నాయో!?
లెక్కపెడదామనుకున్నాను. కానీ
నా అలోచనలకు అందడంలేవవి
.

అహ!,ఎలా దోబుచులాడుతున్నాయో!?
కొన్ని  క్షణాల్లో మాయమవుతూ,
మరికొన్ని కొత్తవి విరబూస్తూ,
ఇంకా కొన్ని రాలిపడుతూ,
భలే తమాషాగా ఉన్నాయి.


ఇంతకీ ఇది ఏ తోట?
నింగిలో కురిసే వెన్నల వర్షమా!?
మనసును తడిపే ఆశల గీతమా!?

 

Monday, April 14, 2014

ఆశల పాట


గదిలో నిశ్శబ్దాన్ని నింపుకోని
దీపపు వెలుతూరులో ఉందామె.
కిటికి ఊచల సందుల్లోంచి
ఎవరికోసమో,దేనికోసమో
గుమ్మం వైపే తదేకంగా చూస్తుంది
.

ఆమె చూపులు
ఎన్నో యుగాల నీరీక్షణను
అంటించుకున్నట్లున్నవి.
ఆమె పెదాలపై
కలల తీగల మెరుపులు
స్పష్టంగా కనపడుతున్నాయి.


అదే దృశ్యం...
అలాగే కొనసాగుతూ ఉంది.

ఆమెలో ఆశ మాత్రం ఎప్పటిలాగే.
కొత్త కొత్త కోరికలను పులుముకుంటూ.


ఎందుకంటే ఆమెకు తెలుసు.
ఇరులలోనే కౌముది అందం
తెలుస్తుందని.
ఎడబాటులోనే జ్ఞాపకాల పాటల్ని
మరింత హాయిగా పాడుకోవచ్చని
.